news logo

రాజకీయాలు

603 క్వింటాళ్ల అక్రమ ఉల్లి నిల్వలు

November 7, 2019 11:10am

ఉల్లి నిల్వలపై అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఉల్లి ధర ఆకాశయానం చేస్తున్న నేపథ్యంలో నల్లబజారు విక్రయాలు, నిల్వలపై అధికారులు దృష్టిసారించారు. నిన్న విజయవాడ, విశాఖపట్నంలోని హోల్ సేల్ మార్కెట్లపై విజిలెన్స్‌ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ప్రస్తుతం ఉల్లి ధర భారీగా ఉంది. మహారాష్ట్ర ఉల్లిపాయలు బహిరంగ మార్కెట్లో రూ.75 పలుకుతుండగా, కర్నూలు ఉల్లి కూడా రూ.50కి చేరింది. రైతు బజార్లలో కర్నూలు ఉల్లి 40 రూపాయలకు, మహారాష్ట్ర ఉల్లి 60 రూపాయలకు విక్రయిస్తున్నా నాణ్యత అంతంతగా ఉండడంతో వినియోగదారులు బహిరంగ మార్కెట్లో కొనుగోలుకే ఇష్టపడుతున్నారు. ఈ నేపధ్యంలో ధర మరింత పెరగకుండా ఉండేందుకు బ్లాక్‌ మార్కెట్‌ దారులపై విజిలెన్స్‌ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా విజయవాడలో భారీ మొత్తంలో అనధికార ఉల్లి నిల్వలను గుర్తించారు. వ్యాపారులు లైసెన్స్‌ లేకుండా కర్నూలు, మహారాష్ట్ర ఉల్లి దిగుమతి చేసుకోవడమే కాక, కొనుగోలు బిల్లులు కూడా లేవని గుర్తించారు. దీంతో మొత్తం 45 మంది వ్యాపారుల నుంచి 603 క్వింటాళ్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ 27 లక్షల రూపాయలు ఉంటుందని అధికారులు తెలిపారు. అలాగే విశాఖ జిల్లాలో విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం ఎస్పీ బి.లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో ఉల్లి హోల్‌సేల్‌, రిటైల్‌ మార్కెట్లపై దాడులు నిర్వహించారు. ముఖ్యంగా విశాఖ నగరంలోని జ్ఞానాపురం హోల్‌సేల్‌ మార్కెట్‌లో జరిపారు. ఉల్లి అధిక ధరకు విక్రయిస్తున్నారని గుర్తించి వ్యాపారులకు నోటీసులు జారీ చేశారు. అలాగే పూర్ణామార్కెట్, నగరంలోని రైతుబజార్లలో తనిఖీలు నిర్వహించారు. ఉల్లిని అక్రమంగా నిల్వ చేసినా, అధిక ధరలకు విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


Share to Twitter

 

 

Illegal onion reserves

 

Related