news logo

బిజినెస్

‘హువావే మేట్‌ ఎక్స్‌’ మడతపెట్టే ఫోన్

October 18, 2019 2:48pm

గత కొద్ది రోజులుగా మార్కెట్‌లో మడతపెట్టే ఫోన్లు సందడి చేస్తున్నాయి. శాంసంగ్‌ ఇప్పటికే ఫోల్డింగ్‌ మొబైల్స్‌ అమ్మకాలు ప్రారంభించింది. దీనికి పోటీగా చైనాకు చెందిన హువావే కూడా ఓ మడతబెట్టే ఫోన్‌ను తీసుకొస్తున్న విషయం తెలిసిందే. ‘మేట్‌ ఎక్స్‌’ పేరుతో ఈ ఫోన్‌ను అందుబాటులోకి రానుంది. ఇప్పటివరకు దీనికి సంబంధించి కొన్ని ఫొటోలు బయటకు వచ్చాయి. ఇప్పుడు ఏకంగా అన్‌బాక్సింగ్‌ వీడియో ఒకటి ఆన్‌లైన్‌లో సందడి చేస్తోంది. మేట్‌ ఎక్స్‌ను తెరిచినపుడు ట్యాబ్‌ పరిమాణంలో డిస్‌ప్లే ఉంటుంది. మడతబెట్టినపుడు సాధారణ స్మార్ట్‌ ఫోన్‌లా సన్నగా ఉంటుంది. వీడియోలో చూపించిన దాని ప్రకారం ఈ ఫోన్‌ను మడతబెట్టి, తిరిగి తెరిచేందుకు ఒక చిన్నపాటి బటన్‌ను అమర్చారు. డిస్‌ప్లే తెరచినప్పుడు 8 అంగుళాలు, మడతపెట్టినప్పుడు 6.6 అంగుళాలు ఉంటుంది. ఫోన్‌తో పాటు దానిని కేరీ చేయడానికి ఒక పౌచ్‌ను కూడా ఇస్తున్నారు. ఆండ్రాయిడ్‌ 9 పై ఓఎస్‌తో మేట్‌ ఎక్స్‌ పనిచేస్తుందట. 4,500ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంటుంది. 55వాట్‌ సూపర్‌ ఛార్జ్‌కు సపోర్ట్‌ చేస్తుంది. ఇందులో మొత్తం మూడు కెమెరాలున్నాయి.ఇవి మూడు డిస్‌ప్లే వెనకవైపున అమర్చారు. వైడ్ యాంగిల్ లెన్స్‌తో 40 ఎంపీ కెమెరా ఇస్తున్నారు. దానితో పాటుగా అల్ట్రా వైడ్‌ యాంగిల్‌ లెన్స్‌తో 16 ఎంపీ కెమెరా, 8 మెగాపిక్సెల్‌ టెలీఫోటో కెమెరా ఉన్నాయి.8 జీబీ ర్యామ్‌, 512 జీబీ ఇంటర్నల్‌ మెమొరీ వేరియంట్‌లో ఈ ఫోన్‌ లభించనుంది. ఈ నెలాఖరులో ఈ ఫోన్‌ను చైనాలో విడుదలచేయనున్నట్లు తెలుస్తోంది. లాంచింగ్‌ సమయంలో కొన్ని లోపాలతో శాంసంగ్‌ ఇబ్బంది పడిన విషయం తెలిసిందే. దీంతో శాంసంగ్‌ ఫోల్డ్‌ ఫోన్‌ను నిలిపేసి.. మార్పులు చేశాక సెకండ్‌ వెర్షన్‌ తీసుకొచ్చింది. దీంతో ఈ ఇబ్బంది తలెత్తకుండా బగ్స్‌, ఇష్యూస్‌ గుర్తించి మెరుగు పరిచేందుకు వీలుగా పరిమిత సంఖ్యలో మాత్రమే వీటిని విడుదల చేస్తారట. హువావే మడతబెట్టే ఫోన్‌కు ప్లాస్టిక్‌ స్క్రీన్‌ను అమర్చారు. మరి ఇది ఎంత మేర ఒత్తిడిని తట్టుకోగలుగుతుందో అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.


Share to Twitter

 

 

Huawei foldable Mate X

 

Related