news logo

సంస్కృతి

కూర్మావతారం నిగూఢమైన భావాల సమాహారం.

June 27, 2019 11:14am

ఓ వైపు హాలాహల జ్వాలలు... మరోవైపు కొండంత భారం... కానీ ఎక్కడా తొణకలేదు... ఇసుమంతైనా బెణకలేదు... ఆ నిశ్చలత్వం, ఆ నిశ్చయతత్త్వం, ఆ త్యాగం నిరుపమానం... అందుకే ఆ అవతారం మహోన్నతం... పరమాత్మ శిష్టరక్షణ కోసం ఎత్తిన ఈ ద్వితీయ అవతారం అతి ప్రాచీనం, నిగూఢమైన భావాల సమాహారం. తాబేటి రూపంలో భగవంతుడు బోధించిన అద్భుత సందేశాల పరంపర నిత్యస్మరణీయం... శ్రీ మహావిష్ణువు అవతారాల్లో అన్నిటికన్నా భిన్నమైంది కూర్మావతారం. మిగిలినవన్నీ రాక్షస సంహారం కోసం ఉద్దేశించినవి. కానీ ఈ అవతారం లక్ష్యం వేరు. క్షీరసాగర మథన సమయంలో సముద్రంలోకి కుంగిపోతున్న మందర పర్వతాన్ని నిలబెట్టడానికి శ్రీమహావిష్ణువు కూర్మావతారాన్ని ధరించాడన్నది అందరికీ తెలిసిన పురాణం కథనం. ఇక్కడ ఎలాంటి పోరాటం లేదు. రక్తపాతం అసలు లేదు. కానీ మంచిని రక్షించేందుకు భారం మొత్తాన్ని తన భుజస్కందాలపై మోశాడు పరమాత్మ. భాగవతంలో, బ్రహ్మపురాణంలో కూర్మావతారానికి సంబంధించిన గాథలు విస్తారంగా ఉన్నాయి. కూర్మ - అనే పదానికి వ్యుత్పత్తి ప్రకారం ‘కం జలం ఊర్వతీతి హినస్తేతి కూర్మః’ - అంటే నీటిలోని క్రిములను సంహరించేది అని అర్థం ఉంది. కూర్మానికి నీటిలోని క్రిములను, మురికిని నశింపజేసే గుణం ఉంది. అందువల్ల దానికి ఆ పేరు వచ్చింది. లౌకిక అర్థంలో సాధారణ నీటిలో ఉన్న క్రిములను నశింపజేస్తే ...ఆధ్యాత్మిక కోణంలో భవసాగరంలో మునిగిన మనిషిలో ఉండే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే క్రిములను నశింపజేసే వాడు కూర్మనాథుడనే అర్థాన్ని చెప్పుకోవచ్చు. కూర్మం స్థిరత్వానికి ప్రతీక. జలంలో నివసించే తాబేలు తాను కదలాలనుకున్నప్పుడు మాత్రమే కాళ్లను కదిలిస్తుంది. అలా లేనప్పుడు నీటిలో స్తంభించి ఉంటుంది. ఇంద్రియాలను పూర్తిగా అదుపులో ఉంచుకుని అవసరమైనప్పుడు మాత్రమే వాటిని ఉపయోగించాలనే స్థితప్రజ్ఞతకు ఇది నిదర్శనం. అవసరమైనప్పుడు బహిర్ముఖంగా ఉన్నా నిరంతరం అంతర్ముఖంగా ఉండే చిత్తవృత్తికి కూర్మమే ప్రతీక. అది తన దేహంతో జలమంతా క్రీడిస్తున్నట్లు.. మనిషి కూడా విశ్వశక్తిలో ఓలలాడమనే సందేశమూ ఇందులో ఉంది. ఇలాంటి మహోన్నత భావాలకు సూచిక అయిన కూర్మం భగవత్స్వరూపమని భక్తులు విశ్వసిస్తారు. సృష్టికర్త ఆయనా? బ్రహ్మ సృష్టి చేయడానికి పూనుకున్నాడు. దేనిని ముందుగా సృష్టించాలా అని ఆలోచించటం ప్రారంభించాడు. ఈ దశలో అన్యాపదేశంగా తన శరీరాన్ని కదిలించాడు. వెంటనే ఆయన శరీరం నుంచి కొన్ని రుషి సంఘాలు పుట్టాయి. వారే అరుణులు, కేతులు, వాతరశనులు. ఆయన గోళ్ల నుంచి వైఖానసులు, వెంట్రుకల నుంచి వాలఖిల్యులు జన్మించారు. అప్పుడే బ్రహ్మ శరీరంలోని సారమంతా ఒక పెద్ద కూర్మంగా రూపాంతరం చెంది నీటిలో సంచరించడం మొదలుపెట్టింది. దానిని చూసిన బ్రహ్మ నువ్వు నా శరీర మాంస సారం నుంచి పుట్టావు కదా అని ప్రశ్నించాడు. అప్పుడా కూర్మం నేను నీ కంటే ముందు నుంచే ఈ జలంలో ఉన్నానని చెప్పింది. బ్రహ్మకన్నా ముందు ఉన్నదేంటి? అయితే అది పరబ్రహ్మే. ఆ కూర్మమే పరమాత్మ అని గ్రహించాడు. అతనిని వేయి శిరస్సులు, కళ్లు, కాళ్లు ఉన్న మహా పురుషుడిగా గ్రహించాడు బ్రహ్మ. నీవు నా కన్నా ముందు నుంచే ఉన్నవాడవు కాబట్టి కురుష్వ (సృష్టి చెయ్యి) అన్నాడు బ్రహ్మదేవుడు. అప్పుడు కూర్మనాథుడు సూర్యుడు, ఇంద్రుడు, అగ్ని తదితరాలను సృష్టించాడు. ఈ విధంగా జగన్నిర్మాణమనే కర్మ చేయడం వల్ల ఆయనకు కూర్మ అనే పేరు వచ్చింది. ఆ పట్టుదల అద్భుతం... కూర్మావతారం మనిషికి మరో మహత్తరమైన సందేశాన్ని అందిస్తుంది. పట్టుదల, ఓర్పు, సహనం మనిషికి తప్పనిసరిగా ఉండాలని, అప్పుడే అతడి లక్ష్యం నెరవేరుతుందని ఈ అవతారం ద్వారా మహావిష్ణువు ఆచరణాత్మక సందేశం ఇచ్చాడు. మనం ఏమైనా గొప్ప కార్యాలు తలపెట్టినప్పుడు ఆ పని భారం మందర పర్వతం తీరులో చాలా బరువుగా మారుతుంది. ఒక్కోసారి వదిలేయాలని అనిపిస్తుంది. దీనికి తోడు కార్యసాధనలో మనకు కలిగే అవాంతరాలు మందర పర్వతానికి కట్టిన వాసుకి సర్పం విడిచే విషజ్వాలల్లాంటివి. అవి మన పరిస్థితుల్ని మరింతగా వేడెక్కిస్తాయి. ఇలా ఎన్ని సమస్యలు వచ్చినా పట్టువదలకుండా స్థిరంగా ఉంటేనే అమృతం పుట్టినట్లు మన కార్యం విజయవంతమై ఆశించిన లక్ష్యసాధన అనే అమృతం పుడుతుందని కూర్మం సందేశాన్నిస్తుంది. ఈ సందేశాన్ని అందిపుచ్చుకుంటే మానవ జీవితం అమృతమయం అవుతుందనటంలో సందేహం లేదు. ఈ రెండూ... శ్రీకూర్మం శ్రీకాకుళం జిల్లా శ్రీకూర్మం కూర్మనాథ క్షేత్రం. స్థల పురాణాన్ని అనుసరించి శ్వేతమహీపతిని అనుగ్రహించటానికి స్వామి వెలిశాడని చెబుతారు. అలాగే, రోగి అస్తికలను ఇక్కడి శ్వేత పుష్కరిణిలో వేస్తే అందులో నీరు తాబేళ్లుగా మారాయని, అందుకనే అశుచి కలిగిన మనుషులు అక్కడి నీళ్లను తాకకూడదన్న నిబంధన ఉంది. ఈ దేవాలయాన్ని గురించి కాల వివరాలు అంత సమగ్రంగా లేవు. క్రీ.శ. రెండో శతాబ్దం నాటికే ఈ దేవాలయం ఉందని చరిత్రకారులు చెబుతారు. ఏడో శతాబ్దానికి దేవాలయ వైభవం ఉచ్ఛస్థితిలో ఉన్నట్లు తెలిపే శాసనాలు, ఆలయ మంటపంలోని స్తంభాలపై కనిపిస్తాయి. 11వ శతాబ్దంలో ఆ ఆలయాన్ని తూర్పు గంగరాజులు, ప్రాకారాన్ని మధ్వాచార్యులైన నరహరితీర్థులు నిర్మించారని చారిత్రక శాసనాలు వివరిస్తున్నాయి. స్వామికి సింహళ దేశానికి చెందిన భాగళాదేవి అమూల్య ఆభరణాలు సమర్పించారని, చైతన్య ప్రభువు క్రీశ 1512లో ఆలయాన్ని సందర్శించారని చెబుతారు. పద్మపురాణం, పాంచరాత్రాగమసంహిత గ్రంథాలు ఆ క్షేత్ర మహిమను ప్రస్తావించాయి. చోళ చక్రవర్తి కాలంలో ఈ వైభవం తారస్థాయికి చేరినట్లుగా మరికొన్ని శాసనాలు ద్వారా తెలుస్తోంది. అనంగభీముడు నిర్మించిన ‘తిరుచుట్టుమంటపం’ స్తంభాలపై ఒరియా, తెలుగు, దేవనాగరి, ప్రాకృత భాషల్లో కనిపిస్తాయి. సింహాచలం కప్పస్తంభం మాదిరిగానే ఈ క్షేత్రంలో కూడా ఇచ్ఛాప్రాప్తి స్తంభం ఉంది. దీనికి కౌగిలించుకుంటే కోరికలు తీరుతాయని శాసనాలు తెలియజేస్తున్నాయి. కచ్ఛపేశ్వరస్వామి శ్రీమహావిష్ణువుకు అత్యంత బాధ కలిగిన అవతారం కూర్మావతారం. తాబేలు రూపంలో మందర పర్వతాన్ని మోస్తున్నప్పుడు మొదట హాలాహలం పుట్టింది. ఆ విషం నుంచి ఉద్భవించిన జ్వాలలకు స్వామి శరీరం తపించిపోయింది. కానీ లోకసంరక్షణ కోసం స్వామి అమృతం పుట్టేవరకు అలాగే కదలకుండా ఉన్నాడు. ఆ ఘట్టం పూర్తయింది. కానీ, స్వామికి కలిగిన తాపం మాత్రం తగ్గలేదు. ఏం చేయాలో దిక్కుతోచలేదు. చివరకు పరమేశ్వరుడిని ఆశ్రయించాడు విష్ణుమూర్తి. అప్పుడు పరమేశ్వరుడు విష్ణువుతో ‘నేను కాంచీపురంలో ఏకాంబరేశ్వరుడిగా ఉన్నాను. నేను తూర్పుదిక్కును చూస్తుంటాను. నా ఆలయానికి దగ్గరగా పశ్చిమదిక్కును చూస్తూ నీవు నిలబడు’ అన్నాడు. సరిగ్గా ఆ ప్రాంతంలో నిలబడ్డాడు విష్ణువు. అప్పుడు పరమేశ్వరుడి జటాజూటంలో ఉండే చంద్రవంక చల్లదనం తగిలి శ్రీమహావిష్ణువు శరీరం చల్లబడింది. ఇక్కడ శివుడికి చంద్రకంఠేశ్వరుడు అని పేరు. శ్రీ మహావిష్ణువుకు కచ్ఛపేశ్వరస్వామి అనిపేరు. తిరుమంగై ఆళ్వార్లు అక్కడ శ్రీమహావిష్ణుస్వరూపం మీద స్తోత్రం చేశారు.


Share to Twitter

 

 

Kurmavataram

 

Related