news logo

సంస్కృతి

కాల గమనం అదో మహా అద్భుతం...

January 4, 2019 3:40pm

ఈ పుస్తకం ఎలా ఉందంటే చెప్పగలం... కంప్యూటర్‌ ఎలా ఉంటుందంటే చూపగలం... ఆ భవనం ఇలా ఉంటుందనీ వివరించగలం.. మరి రేపు... ఎలా ఉంటుంది? గత ఏడాది ఏమైపోయింది? ఈ రోజు ఎక్కడ కలిసి పోతుంది? ఈ ప్రశ్నలకు సమాధానం ఎవరూ చెప్పలేదు. ఎక్కడా వివరించలేదు. ఎందుకంటే అదొక్కటే అనంత శక్తి సంపన్నం కాబట్టి ఆ కాలానికంటే ముందు పరుగెత్తుకెళ్లి అదెక్కడికెళుతుందో తెలుసుకోవడం మాత్రం సాధ్యంకావడం లేదు. అదో అనంత వాహిని. ఎక్కడ పుట్టిందో, ఎప్పుడు పుట్టిందో అంతుచిక్కని ఓ మహాప్రవాహమది. కాలం ఎటెళ్లిపోతుంది, మళ్లీ తిరిగి రాదెందుకు? అని ప్రశ్న వేసుకుంటే దానికి సమాధానంగా అది స్వయంభువు (స్వయంగా ఉద్భవించిన) అయిన పరమాత్మ అని మాత్రం వేదాల్లో కనిపిస్తుంది. స్వయంభువు కాబట్టి దాని పుట్టుకను ఎవరూ చూడలేదు. మరో కొత్త సంవత్సరంలోకి మనం పాదం మోపాం. అసలీ కాల స్వరూపాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే ప్రతి క్షణమూ మనకో బహుమానమే... కాలం ఒక నిండుకుండ. అదెప్పుడూ తొణకదు. నీళ్లు నిండా ఉన్న కుండలోకి ఏదైనా పాత్రను ముంచితే లోపలి నీళ్లు బయట పడుతుంటాయి. అలాంటి సందర్భాల్లో కుండ లోపల, బయట ఎలాగైతే నీళ్లుంటాయో, కాలం కూడా సర్వత్రా వ్యాపించి ఉంటుందని అంటోంది అధర్వణ వేదం. విశ్వంలో మహత్తరమైంది ఏదంటే అది కాలమే. సంస్కృత సంప్రదాయాన్ని అనుసరించి చూస్తే కాలం అనే పదం పురుషుణ్ణి, కాలి అనే పదం స్త్రీని సూచిస్తుంది. వీరు ఎవరై ఉంటారనే ప్రశ్నకూ వేదమే సమాధానమిచ్చింది. జగత్తుకంతటికీ తల్లిదండ్రులుగా ఉన్న పార్వతీపరమేశ్వరులే కాలి, కాలాలు. కాలం భోళా శంకరుడి స్వరూపం. ఏది కోరుకుంటే అదిస్తుంది. అంటే కాలాన్ని సద్వినియోగం చేసుకుంటే ఏం కావాలంటే అది మనం పొందొచ్చని అర్థం. కానీ దాని విలువ తెలుసుకోకుండా బద్ధకంగా కూర్చుంటే అది మనకోసం ఆగదు. సృష్టిలో మనలాంటి వాళ్లు కోకొల్లలు. వాళ్లందరినీ అనుగ్రహించాలి కాబట్టి మనకోసం ఆగకుండా ముందుకెళ్లిపోతుంది. ఈ ఒక్క విషయాన్ని తెలుసుకొని ఇప్పటి ఈ కాలాన్ని, ఈ క్షణాన్ని మనదే అనుకుని సద్వినియోగం చేసుకుంటేనే జీవితం తరిస్తుంది. కాలం విలువను గురించిన విషయాలను కాల స్వరూప తత్త్వాలను అధర్వణ, యజుర్వేదాలు స్పష్టంగా వివరిస్తున్నాయి. కాలం ఓ నదిలాంటిది. నది మున్ముందుకు ప్రవహిస్తుందేగాని, ఆగి వెనక్కు రమ్మంటే అది రానేరాదు. ఇది నిత్య సత్యం. ఈ విషయాన్ని యజుర్వేద, అరుణ మంత్రాల్లోని ‘నదీవప్రభవాత్కాచిత్‌ అక్షయ్యాత్స్యందతే యథా... ’ మంత్రం ఇలా వివరిస్తుంది. ‘ప్రవహించే ఓ నదిలో అంతకు ముందు ఎన్ని సెలయేళ్లు, చిన్న వాగులు, వంకలు కలిసి ఉంటాయి. అదే తీరులో కాలానికి సంబంధించిన కల, కాష్ఠ, తృటి, క్షణ, ముహూర్త లాంటివి దిన, పక్ష, మాస, అయనాల్లాంటివి ఎన్నెన్నో మిళితమై ఉంటాయి. ఆ సమ్మిళిత కాలాన్నే ఒక సంవత్సర కాలంగా చెబుతామంటారు. కాలం అత్యంత చైతన్యవంతమైంది. పంచభూతాల చేతనత్వమంతా దాని అదుపులోనే ఉంటుంది. పంచ భూతాలు ఒక్కటి మాత్రమే కాదు, సర్వసృష్టి, దేవతలు, యజ్ఞయాగాదుల్లాంటి శుభకార్యాలు... ఒకటేమిటి.. ఎన్నో ఎన్నెన్నో అన్నీ ఆ పరమేశ్వర రూపమైన కాలం చెప్పినట్లు, అది చేసినట్లు ప్రవర్తిస్తూ ఉంటాయి. నాకు సమయం సరిపోదు, సమయం చాలదు, ఆ సమయానికి నేను అందుకోలేను... ఇలాంటి మాటలు మనం తరచూ వింటుంటాం. ఇలాంటి మాటలు అనడం వెనక కాస్తంత సోమరితనం, బద్ధకం అనే వాటితో పాటు సమయం లేదా కాలంపై అవగాహన లేకపోవడం కూడా కారణంగా కనిపిస్తుంది. అందుబాటులో ఉన్న సమయంలో బద్ధకాన్ని విడిచి లోభమోహాలను పక్కనబెట్టి చేయాల్సింది చేస్తే జీవితం తరిస్తుంది. మన పురాణాలు, ఇతిహాసాల్లో ఇలా చేసి జీవితాన్ని తక్కువ సమయంలో తరింపజేసుకున్న మహాత్ములెందరో ఉన్నారు. పూర్వం ఖట్వంగుడనే మహారాజు ఉండేవాడు. ఆ రోజుల్లో దేవతలకు రాక్షసుల వల్ల ఇబ్బంది కలుగుతుండేది. యుద్ధం అనివార్యమైంది. అప్పుడు ఖట్వంగుడు దేవతల పక్షాన నిలిచి పోరాడాడు. దేవతలకు విజయాన్ని చేకూర్చిపెట్టాడు. అప్పుడు దేవతలు ఆ రాజు దగ్గరకొచ్చి ఏ వరం కావాలో కోరుకోమన్నారు కృతజ్ఞతగా...అప్పుడు రాజు నా జీవితకాలం ఇంకా ఎంతుందో చెప్పండి అని అడిగాడు. చూస్తే ఒకే ఒక్క ముహూర్త కాలం ఉంది. ఆ విషయం విన్న ఆ రాజు ఏ మాత్రం బాధకు, దిగులుకు లోను కాలేదు. ఇంకా ఇంకా ఆయుష్షు కావాలని అడగనూ లేదు. క్షణం కూడా వృథా చేయకుండా ఓ ప్రశాంత ప్రదేశానికి వెళ్లి శ్రీమహావిష్ణువును గురించి తపస్సు చేసి మోక్షాన్ని పొందాడు. ఇలాంటి విషయాన్నే స్ఫూర్తిగా తీసుకుని అందరికీ తెలిసిన మరో రాజు కూడా తనకున్న తక్కువ సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. ఈ రాజు పేరే పరీక్షిత్తు. తన జీవితం ముగియడానికి కేవలం వారం రోజులు మాత్రమే ఉందని తెలుసుకున్న పరీక్షిత్తు శోకించడం, మోహభ్రాంతులకు గురికావడం ఏమీ చేయలేదు. తనకు పురావృత్తిరహితమైన మోక్ష స్థితి కలగడానికి ఒకే ఒక్క సాధనం మహాభాగవత శ్రవణం అని తెలుసుకున్నాడు. ఆ వారం రోజుల్లో శుక మహర్షి చేత మహాభాగవతం చెప్పించుకుని విని జీవితాన్ని సార్ధకం చేసుకున్నాడు. ఇంతటి మహత్తరం, మహిమాన్వితం అయింది కాబట్టే కాలాన్ని మనం భక్తితో సద్వినియోగం చేసుకోవాలి. పోపు తగలగానే వంటకు రుచి పెరిగినట్లు మార్పు కారణంగా బతుక్కి రుచి పెరుగుతుంది. ఆశలొక్కటే కాదు మనిషికి ఆశయాలూ ముఖ్యమే. ఆశలు, ఆశయాలుగా మారితే మనిషి విజేత అవుతాడు. దానికి కావాల్సింది ఒక అద్భుతమైన ఆలోచన. ఒక చక్కటి నిర్ణయం... దేనికైనా ఇదే మంచి సందర్భం. లేవండి... సంకల్పించుకోండి. కాలగతిలో మరో చిత్రమైన విషయం ఏంటంటే కొత్త విషయాలపై మోజు బలపడుతుంది. పాతవాటితో అనుబంధం పూర్తిగా తెగిపోదు. ఈ పాత కొత్తల మేలు కలయికే జీవితం. మనం పాత, కొత్తల మధ్య పరిమళభరితమైన ఓ వంతెనను నిర్మించుకోవాలి. పాత అనుభవాల పునాదులపై కొత్త ఆశలు, ఆశయాల సౌధాలను నిర్మించుకోవాలి.


Share to Twitter

 

 

Time travel

 

Related