news logo

సంస్కృతి

అడవిని సృష్టించిన మహనీయుడు...70 ఎకరాల మానవ వనం

December 31, 2018 12:14pm

మీకో 70 ఎకరాల సుక్షేత్రం ఉంటే ఏం చేస్తారు...? బంగారం లాంటి పంటలు పండించుకుంటారు... లేదా ఇంకో అడుగు ముందుకేసి ప్లాట్లుగా మార్చి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసుకుంటారు... కానీ ఈయన మాత్రం చాలా ప్రత్యేకం... ఎవరూ ఊహించని పని చేశారాయన... తనకున్న డెబ్భై ఎకరాల భూమిలో ఏకంగా అడవినే సృష్టించాడు. ప్రకృతి నుంచి మనం ఎంతో తీసుకుంటున్నాం... కొంతైనా తిరిగి ఇవ్వలేమా అన్న ఆలోచనే ఆయనతో ఈ పని చేయించింది... చుట్టూ ఉన్న వాళ్లే కాదు, చివరకు అయిన వాళ్లు వ్యతిరేకించినా ఆయన మడమ తిప్పలేదు... ఏసీ గదిలో కూర్చొని పనిచేసే ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలి పచ్చని అడవికి తన జీవితాన్ని అంకితం చేశారు. ఆ వన నిర్మాత పేరు దుశర్ల సత్యనారాయణ. అడవి దాగిన ఆయన కథేంటో చదివేయండి.. సత్యనారాయణకు ప్రకృతిపై మమకారం ఒక్కరోజులో పెరిగింది కాదు. ఉమ్మడి నల్గొండ జిల్లా రాఘవాపురం అతడి గ్రామం. పల్లె పచ్చదనం ఆయనకు ప్రకృతిని ప్రేమించేలా చేసింది. మొక్కలు పెరుగుతుంటే, చెరువులో కలువలు వికసిస్తుంటే ఆనందంగా చూసేవారు. ఆ ఆసక్తి 1977లో ఇరవై మూడేళ్ల వయసులో ఆయన బ్యాంకు ఉద్యోగంలో చేరిన తర్వాత కూడా కొనసాగింది. ప్రకృతిపై మమకారం, పర్యావరణంపై ప్రేమ ఆయనలో రోజురోజుకీ పోగుపడుతూనే ఉన్నాయి. దానికోసం ఏదైనా చేయాలనే కాంక్ష బలపడుతూనే ఉంది. దానికోసం ఆయనో నిర్ణయం తీసుకున్నారు. బహుశా చాలామంది ఆలోచించడానికి కూడా సాహసించరు. ఉద్యోగంలో చేరిన మూడేళ్లకే ఆయన రాజీనామా చేశారు. సూర్యాపేట-ఖమ్మం జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న 70 ఎకరాల వ్యవసాయ క్షేత్రం ఉంది. విలువ కూడా ఎక్కువే. పైగా ఏటా రెండు పంటలు పండే సుక్షేత్రమది. దాన్ని అడవిగా మార్చాలని నిర్ణయించుకున్నారు. బంగారంలాంటి భూమిని అడవిగా మార్చడమేంటని తలోమాట అన్నా పట్టించుకోలేదు. ఒక స్పష్టమైన కార్యాచరణతో ముందడుగు వేశారు. అడవిని సృష్టించడానికి కొన్నేళ్లు శ్రమించారు దుశర్ల. దేశంలో వివిధ ప్రాంతాలు తిరిగి అక్కడ నుంచి విత్తనాలు తీసుకొచ్చి పొలంలో నాటేవారు. వాటిని జాగ్రత్తగా కాపాడుకునేవారు. రకరకాల మొక్కలు వందల్లో తెచ్చి వాటిని పెంచడం ప్రారంభించారు. ఆ మొక్కలకు నీటి కోసం ఒక్కడే కొన్ని నెలల పాటు శ్రమించి కాలువ తవ్వారు. ఇలా పెంచిన మొక్కలు నేడు మహా వృక్షాలుగా మారాయి. ఎక్కడెక్కడో తిరిగి నెమళ్లు, కుందేళ్లు తీసుకొచ్చి తన అడవిలో వదిలారు. కొన్ని వందల కోతులు అక్కడ తిరుగుతున్నా తరమలేదు. పైగా వాటికి ఆహారంగా స్వయంగా ఆయన కొన్ని రకాల దుంపలు, సజ్జలు పెంచారు. కేవలం తామరపూలు పెంచడానికి ఇక్కడ ఏడు కుంటలను తవ్వించారు. అరుదైన తెల్లమోదుగ చెట్లు ఈ అడవిలో ఉన్నాయి. ఇక్కడ కొన్ని వందల తునికాకు చెట్లు ఉన్నాయి. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి బీడీ చెట్లను కొనడానికి ప్రయత్నించినా ఈయన అమ్మడానికి ముందుకు రాలేదు. కోట్ల ఆదాయం కళ్లెదుట ఉన్నా.. అమ్మడానికి నిరాకరించారు. ఎక్కడెక్కడో తిరిగి, అలసిపోయి వచ్చిన పక్షులు ఇక్కడకు వచ్చి ఈ అరణ్యంలోని చెట్లపై హాయిగా సేద తీరుతాయి. మోదుగ, దుమ్మ, బిరిచచెన, జిగినిక, మోవుంచి, మేడి, వేప, బలుసు లాంటి కొన్ని వందల చెట్లు ఈ అడవిలో పెరుగుతున్నాయి. లకుముకి పిట్టలు, గిజిగాళ్లు, కోయిలలు, రామచిలుకలు, గద్దలు, వడ్రంగి పిట్టలు, బుడుబుంగలు, నీటి కోళ్లు, ఎత్రింతలు, వంగపండు పిట్టలు, గుడ్డి కొంగలు, గువ్వలు, గోరింకలు, కముజు పిట్టలు వంటి పక్షులన్నీ ఈ అడవిలో ఉన్నాయి. ముంగిసలు, అడవిపందులు, కోతులు, పాములు, ముళ్లపందులు, ఉడతలు ఇక్కడ ఆశ్రయం పొందుతున్నాయి. సత్యనారాయణ సృష్టించిన అడవిలో రకరకాల పంటలు కనిపిస్తాయి... కానీ వాటిని మనుషులు తినేందుకు ఉపయోగించరు. చిన్న చెరువులు, నీటి కుంటల్లో పుష్కలంగా నీరుంటుంది... కానీ వాటితో పంటలు పండించరు. ఎన్నో రకాల వృక్షాలు పెరుగుతుంటాయి... కానీ వాటితో వ్యాపారం చేయరు. ఆ అద్భుతమైన ప్రకృతి అంతా తిరిగి ప్రకృతికి ఇచ్చేందుకే... పశుపక్ష్యాదులకు ఆవాసం కల్పించేందుకు, తరిగిపోతున్న అరణ్యాలను కాపాడేందుకు, పర్యావరణాన్ని రక్షించేందుకు జరుగుతున్న ఓ గొప్ప యజ్ఞమది. ఇదంతా పెద్ద పేరున్న సామాజిక సంస్థో, వందలాది మంది పర్యావరణ పరిరక్షకులో చేస్తున్నది కాదు.. ఒకేఒక్కడి సంకల్ప ఫలితం!! ఈ అరణ్యం ఆధ్యాత్మికంగా కూడా విశేషాలను సంతరించుకుంది. ఇందులో ఉన్న కొన్ని గుట్టలపై విష్ణుపాదం, త్రిశూలం మధ్యలో శివలింగాకారం, తాబేలు ఆకారాలు వంటివి ఉండడంతో కొందరు భక్తులు వచ్చి పూజలు చేస్తుంటారు. ప్రతి పౌర్ణమి నాడు ఇక్కడ బాగా సందడిగా ఉంటుంది. శివరాత్రి రోజు ఇక్కడకు పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఫ్లోరైడ్‌ బాధితుల కోసం కదం తొక్కి సత్యనారాయణ కేవలం అడవిని మాత్రమే సృష్టించలేదు. వివిధ సమస్యలపై కూడా తనవంతు పోరాటం చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లాను ఒకానొక కాలంలో అతలాకుతలం చేసిన ఫ్లోరైడ్‌ సమస్య చూసి చలించి జలసాధన సమరాన్ని ప్రారంభించారు. అప్పుడు ప్రధానిగా ఉన్న వాజ్‌పేయి దగ్గరకు బాధితుల్ని తీసుకెళ్లి సమస్యను ఆయనకు ఏకరవు పెట్టారు. సాగునీరు కోసం రైతుల పడుతున్న కష్టాలను ప్రభుత్వాలకు తెలియజేసేందుకు జలసాధన సమితిని ఏర్పాటు చేసి, నీటి కోసం ఉద్యమించారు.


Share to Twitter

 

 

He was a man of jungle

 

Related